Wednesday, November 25, 2009

మనిషి ఒక్కడుగానే కాదు జాతి జాతిగానే దుర్మార్గుడు.........

మనిషి ఒక్కడుగానే కాదు జాతి జాతిగానే దుర్మార్గుడు,
ఎంతటి దౌర్జన్యం లేకపొతే తరతరాలుగ ప్రవహిస్తున్న వైదిక తేజస్వి జీవనస్రవంతికి మోకాలడ్దుతాడు,
తానొక్కడే ఆశాశ్వత సౌఖ్యాలను అనుభవించాలనే దుష్ట సంకల్పంతో,
సత్సాంప్రదాయాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు.
కాని మనిషి ఏదో మజిలికో, చిరుశిఖరాగ్రానికో చేరుకోగానే సాధకోత్సాహం ఉపశమించి శూన్యంలోకి జారిపోతాడు,
వైభవోపేతమైన ఒంటరితనం ఆవహించి ఏకాకిగా మిగిలిపోతాడు.
గతం మీద బెంగపడతాడు తాను విదిల్చికొట్టిన,వదిలించుకొన్న తన్నిపారేసిన ఒలకబోసుకున్న,
మధురక్షణాలను, ప్రేమానురాగాలను వాటి ప్రతిరూపాలైన మనుషులను తలచుకొని గుక్కపెట్టి
వెక్కివెక్కి ఏడుస్తాడు.
గర్బస్థ శిశువు నిద్రలో గత జన్మల కలవరింతలున్నట్టే,
ఈ భూమండలం తన మీద నడయాడిన కాలాలను వాటితోపాటే సాంప్రదాయలను, పదిలపర్చుకుంటూ తరతరాలకు అందిస్తూనేవుంది.
మానవుడే వైభవొపేతమైన సాంప్రదాయలను విస్మరించి చితిలో ఆత్మీయుల అస్థికల కోసం వెదుకులాడుతు,
వర్తమానంలో పతనమై వచ్చుకాలము కంటే గతకాలము మేలన్న నన్నయ్యను గుర్తుతెచ్చుకుంటాడు.
ఉందిలే మంచికాలం ముందుముందునా అంటూ ధైర్యం చెప్పిన
వైతాళికులు సైతం పసిడిరెక్కలు విసిరి పారిపోయిన,
మసకబారిన సాంప్రదాయపు జాడలకోసం తడుముకుంటాడు.
భవిష్యత్తు మీద శంకే గతం మీద బెంగ,
తొణికిన స్వప్నాలను మరోసారి హత్తుకోవాలని విరిగిన బంధాలను తిరిగి అతికించుకోవాలని,
పల్లెటూరు,మట్టిబాల్యం,వీధిబడులు,జమ్మిచెట్టు,పాలపిట్ట,
సేమోల్లంఘనం,అలైబలైలు మళ్ళీరావు ఎక్కడ ఉంటాయో అసలు
ఉండవో కూడా భవిష్యత్తు తరానికి తెలియదు.
శిథిలమయ్యి ,శల్యమయ్యి, అవన్ని అక్కడే ఉంటాయ్,
కాని మనం అక్కడికి వెళ్ళం, చిట్టచివరికి బెంగపడడం మీద ఉన్నంత మోజు
తీర్చుకోవడం మీద ఉండదు.
వాస్తవంలో అంతరిస్తున్న సాంప్రదాయలను కాపాడుకోలేకుంటే, ముందుతరాలకు అందించకుంటే మానవుని నిర్వచనమే మారిపోతుంది ప్రశ్నార్థకమవుతుంది...!

No comments:

Post a Comment